ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి యాకూబ్ మెమన్ కు ఎట్టకేలకు ఉరితాడు బిగించుకోనుంది. తన ఉరిపై స్టే విధించాలన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను విస్తృత ధర్మాసనం బుధవారం కొట్టేసింది. మరణశిక్ష రద్దు కోసం అతను చేసిన ప్రయత్నాలను బెడసి కొట్టాయి. దీంతో గురువారం నాగపూర్ జైల్లో అతడికి ఉరిశిక్ష ఖరారు చేయడం దాదాపు ఖరారైంది. రాష్ట్రపతి వద్ద అతను పెట్టుకున్న క్షమాభిక్ష ఇంకా పెండింగ్ లోనే ఉంది. రాత్రికి రాత్రి అద్భుతం జరిగితే తప్ప అతని ఉరి ఆగే ప్రసక్తే లేదు. పిటిషన్ పై మంగళవారం జరిగిన విచారణలో జస్టిస్ లు ఇద్దరు భిన్న అభిప్రాయాలను వ్యక్తపరచడంతో విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. 1993 మార్చి 12 శుక్రవారం జరిగిన పేలుళ్లలో దాదాపు 350 మంది మరణించగా, 1200 మంది క్షతగాత్రులయ్యారు. ఈ కేసుల్లో మరో సూత్రధారి దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్థాన్ లో ఆశ్రయం పొందుతుండగా, మెమన్ పారిపోతూ నేపాల్ పోలీసులకు పట్టుబడి భారత్ కు చేరవేయబడ్డాడు.