ఇటీవల గోదావరి పుష్కరాల సందర్భంగా తొక్కిసలాట 27 మంది మరణానికి కారణమైంది. పుణ్య స్నానమాచరించాలన్న ఆత్రుతతో జనాలు ఒక్కసారిగా తోసుకురావటంతో వారంతా మృత్యు ఒడిలోకి జారుకున్నారు. ఓ వైపు అధికారుల అతితోపాటు, జనాల ఆత్రుత కూడా ఈ ఘోర ఘటనకు కారణమైంది.
తాజాగా శ్రావణమాసం సందర్భంగా.. జార్ఖండ్ లో నేటి ఉదయం ఓ దుర్గామాత ఆలయం లో తొక్కిసలాట చోటు చేసుకుంది. భక్తుల రద్దీ విపరీతంగా ఉండటం.. అమ్మవారిని దర్శించుకోవాలన్న ఆతృతలో తొక్కిసలాట చోటు చేసుకుందని చెబుతున్నారు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా.. 50 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. జార్ఖండ్ లోని దియో గఢ్ దుర్గామాత ఆలయంలో చోటు చేసుకున్న ఈ ఘటన కు సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది. భక్తులు భక్తి పేరుతో తొందరపాటుకు, అలాగే అధికారులు తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటే అందరికీ మంచింది. అయిన వాళ్లను పోగొట్టుకునే కుటుంబాలు పడే నరకం అంతాఇంతా కాదన్న విషయాన్ని గుర్తించి.. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పుణ్యం కోసం ప్రాణాలు పొగొట్టుకోవాలా? ఆలోచించండి...