జిల్లాలోని ద్వారక తిరుమలలో కోడిపందాలు ఆడుతున్న టీడీపీ నేతలను పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అయితే వీరిని వెంటనే విడుదల చేయాలని మంగళవారం ఆ పార్టీ ఎంపీలు పోలీసులను డిమాండ్ చేశారు. నేతల అరెస్ట్ కు నిరసనగా ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీలు మాగంటి బాబు, మాగంటి మురళీమోహన్, గోకరాజు గంగరాజుతోపాటు ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బైఠాయించారు. దాంతో జడ్పీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగారు. కోడి పందాలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఇప్పటికే హెచ్చరించారు. అదికాక రాష్ట్రంలో కోడి పందేల నిర్వహణకు ఎవరికీ అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి కోడి పందేలను నిర్వహించినా, జూదమాడినా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.