మృత్యువు ఎవరిని ఎలా కబళిస్తుందో ఊహించలేం... కళ్ళు మూసి తెరిచేంతలోపల తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న తుఫాన్ వాహనం అదుపు తప్పి ధవళేశ్వరం బ్యారేజీపై నుంచి గోదావరి నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 9మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 23మంది ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లా అచ్యుతాపురం వాసులు తీర్థయాత్రలకు వెళ్ళి, తిరుపతి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్ కూడా మృతి చెందాడు. దాదాపు 50 అడుగుల పైనుంచి పడటంతో వాహనం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను క్రేన్ల సాయంతో వెలికి తీశారు. ఈ ప్రమాదం నుంచి ఒక పాప, ఒక బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా పాప కూడా మృతి చెందింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.