ఒకప్పుడు భారతీయులపై పెత్తనం చలాయించిన బ్రిటన్ దేశంలో మన ఉగాది జరుపుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది కదా... అది కూడా ఎక్కడో కాదు వారి పార్లమెంటు భవనంలోనే ఉగాది పండుగ జరుగుతోంది. వరుసగా ఇది రెండో సంవత్సరం ఉగాది జరుపుకోవడం. తెలుగు ప్రవాస భారతీయుల ఫోరం (టీఎన్‌ఎఫ్) ఆధ్వర్యంలో గత ఏడాది బ్రిటన్ పార్లమెంటులో ఉగాది వేడుకలు జరిగాయి. ఈసారి కూడా బ్రిటన్ ప్రజా ప్రతినిధుల నడుమ హౌస్ ఆఫ్ కామన్స్ లోని పదవ నంబరు కమిటీ రూంలో చేయాలని ఫోరం సంకల్పించింది. తమ ప్రతిపాదనకు బ్రిటన్ పార్లమెంటు సభ్యుల, మంత్రుల ప్రోత్సాహం కూడా లభించిందని తెలిపింది. ఈ వేడుకలు మార్చి 25న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8 గంటల వరకూ జరుగుతాయి. వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. సాంస్కృతిక గాన వినోదాలు, ప్రోత్సాహక పతకాల ప్రదానం వంటివి కూడా ఉంటాయి. అలాగే, ఈ సంబరాలకు యూకేలోని తమిళ, కన్నడ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులను కూడా ఆహ్వానించారు. టీఎన్‌ఎఫ్ యూకే అధ్యక్షుడు రమేష్ ఉడత్తు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి.