శరీరంలో అత్యంత సంక్లిష్టమైన భాగం మెదడు. దానికి ఆపరేషన్ జరుగుతుంటే... ఎవరికైనా ఎలా ఉంటుంది. కానీ, పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ(34) మాత్రం డాక్టర్లకు చుక్కలు చూపింది. బెంగళూరులోని సీతా బతేజా ఆస్పత్రిలో ఆ యువతికి మెదడులోని కణితిని తొలగించ శస్త్రచికిత్స జరిగింది. దాదాపు మూడున్నర గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్లో ఆమె సమాచార వ్యవస్థ మొత్తం పనిచేస్తూనే ఉంది. మత్తు మందు ఇచ్చినప్పటికీ అది పని చేయకపోవటం విశేషం. ఇక ఓవైపు సీరియస్ గా ఆపరేషన్ జరుగుతుంటే తన కిష్టమైన రవీంద్రనాథ్ ఠాగూర్ పాటలను ఆ యువతి పాడిందట. అంతేకాదు వారాల పేర్లు చెప్పండి? ఆ బొమ్మలో ఏం కనిపిస్తోంది? ఒకటి నుంచి వంద వరకూ, వంద నుంచి ఒకటి వరకూ అంకెలు చెప్పండి? అంటూ ప్రశ్నలు సంధించిందట. ఆమె అలా ఓవైపు మాట్లాడుతుంటే... డాక్టర్లు టెన్షన్ తోనే ఆపరేషన్ ని పూర్తిచేశారట. ఇటువంటి ఘటనలు అరుదుగా జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఆపరేషన్ సమయంలో ఆమె మత్తులో లేదని ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ అరవింద్ తెలిపారు. మెదడులోని కణితి మాట్లాడే శక్తినిచ్చే భాగానికి అతిదగ్గరగా ఉండటంతో, ఆపరేషన్ తర్వాత ఆమె తన మాట్లాడే శక్తిని కోల్పోకుండా ఉండేందుకు ఆపరేషన్ కు ముందు కౌన్సిలింగ్ తీసుకుందని వివరించారు. తద్వారా మత్తుమందు తీసుకున్న ఆమె బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేసిందన్నమాట.