ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల మహానుభావులకు అవమానం జరిగింది. దేశ జాతి ఔనత్యం కోసం విశేషంగా పాటుపడిన మహా నేతలకు అవమానం కలిగించే రీతిలో ఇప్పుడో సంఘటన జరిగింది. జాతిపిత మహాత్మాగాంధీ డై చేసిన టీ షర్ట్ వేసుకుని గాగుల్స్ పెట్టుకుంటే? నెల్సన్ మండేలా అల్ట్రా మోడ్రన్ హెయిర్ స్టయిల్‌తో కనిపిస్తే? ఎలా ఉంటుంది? చూడ్డానికి కామెడీగానే ఉంటుంది. కానీ… వాళ్ళంతా దేశ భవిష్యత్తును మలుపు తిప్పిన మహానాయకులు. ఫేమస్ డిజైనర్ అమిత్ షిమోనీ… పనిగట్టుకుని ప్రసిద్ధి పొందిన ప్రపంచ నాయకులకు మోడ్రన్ లుక్కులు అద్దాడు. గాంధీ నుంచి మొదలు పెట్టి… నాటి అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నడీ, చెగూవెరా, వ్లాడిమిర్ లెనిన్ దాకా... వాళ్ల పాత గెటప్పులు వదిలి ప్రజెంట్ జెనరేషన్‌కు తగ్గట్టు వారి చిత్రాలకు ట్రెండీ గాగుల్స్, హ్యాట్స్, జర్కిన్లు, పెయింట్ చేసి మార్కెట్లోకి వదిలాడు. పైగా మహానాయకులందరూ వాళ్ల సొంత పర్సనాలిటీల డెవలప్‌మెంట్ కోసమే తప్ప ప్రజల కోసం చేసిందేమీ లేదని ఒక ఈ మెయిల్ లో రాశాడు. స్వాతంత్ర్యోద్యమం కంటే ఎక్కవగా తను అందంగా కనిపించడమెలా అనేదాని మీదే అసక్తి చూపించారనీ, అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ బానిసత్వాన్ని పారదోలే మార్గం వెదకకుండా హిప్ బార్ల కోసం వెంపర్లాడాడంటూ... ప్రపంచ నాయకుల మీద అమిత్ షిమోనీ కామెంట్లు పోస్ట్ చేశాడు. దీంతో ఆయనపై విమర్శలు వెలువెత్తడంతో నాలుక కరుచుకున్నాడు. వాళ్ల మీద కామెంట్లు చేయడం తన అభిమతం కాదనీ, వాళ్లు మోడ్రన్ కల్చర్‌కు అలవాటు పడితే ఎలా ఉంటుందన్న అలోచనే తప్ప ... కించపరిచే ఉద్దేశం లేదంటూ దిద్దుబాటు చర్యలు ప్రారంభించాడు. ఇక దీనిపై కొందరు లైట్ తీసుకుంటుంటే మరి కొంత మంది మాత్రం ఇదేం చోద్యమంటూ ట్విట్టర్లలో ఈసడించుకుంటున్నారు. వారంతా ప్రజల కోసం తమ తమ జీవితాలనే పణంగా పెట్టి అహరహం శ్రమించిన మహనీయులు. అటువంటి గొప్పనాయకులకు రోజూ దండం పెట్టి దండలేయకపోయినా ఫర్వాలేదు... కానీ వాళ్లను తక్కువ చేసి వాళ్ల మీద జోకులేయటం మాత్రం దిగజారుడు పనులే అవుతాయి.