మెమన్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే...

July 30, 2015 | 12:36 PM | 4 Views
ప్రింట్ కామెంట్
yakub_memon_newstrack_interview_about_mumbai_blasts_niharonline

ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి యాకుబ్ మెమన్ ను ఈ ఉదయం ఉరి తీసిన విషయం తెలిసిందే. అరెస్టయినప్పటి నుంచి అతగాడు మీడియా ముందు ఎక్కడా నోరు విప్పలేదు. అసలు ఇన్నాళ్లు అతని పేరు వింటున్నాం గానీ, అతగాడి వాయిస్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. అయితే పదేళ్ల క్రితం న్యూస్ ట్రాక్ అనే ఓ చానల్ కి మాత్రం ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఒకేఒక్క ఇంటర్వ్యూలో మెమన్ చెప్పిన ఆసక్తికర విషయాలు ...

‘‘ముంబయి పేలుళ్లకు ఐఎస్ఐ ప్లాన్ చేసింది. మా అన్న టైగర్ మెమొన్ ఆయన అనుచరులు కలిసి ఐఎస్ ఐ ప్లానును అమలు చేశారు. నాకు 1993 బాంబు పేలుళ్లతో ఎలాంటి సంబంధం లేదు. నేను అన్న టైగర్ మెమొన్ మిగతా తమ్ముళ్లు మా అమ్మానాన్న అంతా కలిసి ముంబయిలోనే ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. పెద్దన్న టైగర్ మెమొన్తో ఎప్పుడూ ఒకేసారి ఒక గంట పాటు మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదు. అన్నతో నాకు పెద్దగా చనువు లేదు.. ఆయనకు నాతో మాట్లాడుతూ ఉండేటంత తీరికా లేదు. ముంబయిలో పేలుళ్లు జరగడానికి ముందే టైగర్ ముంబయి నుంచి వెళ్లిపోయాడు. ఒక రోజు ఫోన్ చేసి... ముంబయిలో ఉండటం మంచిది కాదు దుబాయ్కి వచ్చేయమని చెప్పాడు. దాంతో 1993 మార్చి 11న (బాంబు పేలుళ్లకు ఒక రోజు ముందు) అమ్మానాన్నలను తమ్ముళ్లను తీసుకుని నేను దుబాయ్ వెళ్లాను. మార్చి 17 వరకు అక్కడే ఉన్నాం.. ఆ తరువాత పాకిస్థాన్ కు చెందిన ఆసిఫ్ అనే ఏజెంట్ మమ్మల్ని కరాచీ తీసుకెళ్లాడు.  మా ఏర్పాట్లన్నీ ఆయనే చూసుకున్నాడు.  అక్కడికి పదిహేను రోజుల తరువాత కరాచీలోనే మరో ఇంటికి మార్చారు.  ఇదంతా టైగర్ మెమొన్కు మిత్రుడైన తోఫిక్ చూసుకున్నాడు. పాకిస్థాన్ వెళ్లిన తరువాత ఆర్నెళ్లపాటు ఏమీ చేయకుండా ఇంట్లోనే ఖాళీగా ఉండేవాళ్లం. ఆ తరువాత నేను బిల్డింగ్ కనస్ట్రక్షన్ బిజినెస్ తమ్ముడు బియ్యం వ్యాపారం ప్రారంభించాం. 

పాకిస్థాన్ అధికారులు మాకు బాగా సహాయం చేసేవారు. టైగర్ కుటుంబ సభ్యులం కాబట్టే వారు మాకు అన్ని విషయాల్లోనూ సహకారం ఇచ్చేవారని అర్థమైంది. ఆ తర్వాత హటాత్తుగా మమ్మల్ని థాయిలాండ్ తీసుకెళ్లారు. 1994 ఏప్రిల్ 17 నుంచి 29 వరకు బ్యాంకాక్లో ఉంచారు. మాతో కొందరు పాకిస్థాన్ మిలటరీ అధికారులు తోడుగా ఉన్నారు. అప్పుడే నాకు ముంబయి పేలుళ్ల కుట్ర తెలిసింది. అంతవరకు నాకు ఈ విషయాలేమీ తెలియవు.  30వ తేదీన మళ్లీ కరాచీ తీసుకెళ్లారు. అయితే... ముంబయి పేలుళ్లకీ అన్న టైగర్ కూ సంబంధం ఉందని తెలిసిన తరువాత నేను దానికి సంబంధించిన సమాచారం కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాను.  కరాచీలోనే టైగర్ ను కలిశాను. ఆయనతో చాలాసేపు మాట్లాడాను... అప్పటి పరిస్థితులను బట్టి అలా చేయాల్సివచ్చిందని చెప్పాడు. ముంబై పేలుళ్లకు కుట్ర పన్నింది ఐఎస్ఐ అని సూత్రధారి తోఫిక్ జలియావాలా అని అతనే అంతా ప్లాన్ చేశాడని టైగర్ చెప్పాడు. అయితే... కుట్రను అమలు చేసింది మాత్రం మా అన్న టైగర్ మెమన్ ఆయన దగ్గర పనిచేసినవారే... ఆ సంగతి అన్న నాతో చెప్పాడు కూడా. వారందరికీ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందన్నాడు.

                                 దావూద్ కూడా పాక్లోనే ఉన్నాడని టైగర్ చెప్పాడు.. ప్రాణాలను కాపాడుకునేందుకు అన్న చెప్పినట్లు విన్నాను.... ఎవరికీ ఏమీ చెప్పకుండా దాచాను. కీలకమైన సమాచారం రాబట్టేందుకే అన్నకు పాక్ అధికారులకు నమ్మకస్తుడిగా నటించాను. నా చుట్టూ ఎప్పుడూ నలుగురైదుగురు మనుషులతో నిఘా పెట్టించేవారు. అన్న టైగర్ ఆర్థిక లావాదేవీలు నాకేమీ తెలియవు. అన్న టైగర్ మెమన్ తప్ప మా ఫ్యామిలీలో ఇంకెవరికీ ముంబై పేలుళ్లతో సంబంధం లేదు. పేలుళ్ల గురించి నాకు గానీ మా కుటుంబ సభ్యులకు గానీ ముందుగా తెలియదు. తెలిస్తే టైగర్ను ఈ పని చేయనిచ్చే వాళ్లం కాదు. మాకేమీ దీంతో సంబంధం లేదని చెప్పడానికే భారత్ వచ్చాను... పోలీసులకు లొంగిపోయాను.''

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ