సాధారణంగా ఏదైనా పని చేతకానప్పుడు, ఎందుకు పనికి రానప్పుడు గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోరా అని అనటం మనం వింటూ ఉంటాం. అంటే ఆడాళ్లలా ఇంట్లో ఉండటం తప్పించి వాడికి ఏదీ చేత కాదనేది ఆ సామెత సారాంశం. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ గిరిజన యువతి సూటి ప్రశ్న సంధించింది. మహిళల చేతులకు ఆభరణాలుగా ఉంటున్న గాజులు... 'చేతకాని పురుషులు ధరించాలంటూ' అప్పుడప్పుడు కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలను నిషేధించాలంటూ ఆమె ఆ లేఖలో ప్రధానిని డిమాండ్ చేసింది.
వివరాల్లోకెళితే... ఛత్తీస్ గఢ్ లోని జష్ పూర్ జిల్లా కన్సాబెల్ కు చెందిన గిరిజన యువతి సౌమ్య గార్గ్... ‘గాజుల’ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధానికి లేఖ రాసింది. ‘మా మనసులోని మాట ఎవరితో చెప్పుకోవాలి?(మన్ కీ బాత్ మై కిస్ సే కరూ)’’ అనే ప్రారంభ వాక్యంతో లేఖను రాసిన ఆమె, మహిళలు గాజులు తొడుక్కోవడానికి, చేతకాని పురుషులను గాజులు తొడుక్కోమనడానికి సంబంధం ఏముందని ప్రశ్నించింది.
‘‘నువ్వేం చేయలేకపోతే గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చో అంటూ పురుషులను ఉద్దేశిస్తూ ఇటీవల పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలకు, మహిళల గాజులకు ఏమిటి సంబంధం?’’ అంటూ ఆమె ఆ లేఖలో ప్రశ్నించింది. దీనిపై ప్రధాని మోదీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అయితే సదరు లేఖాస్త్రాన్ని అందరికీ తెలిసేలా ప్రధాని ట్విట్టర్ ఖాతాలోనూ పోస్ట్ చేసింది.