మతసహనంపై కాంగ్రెస్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని దేశ ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. 1984 నవంబర్ 2న సిక్కుల ఊచకోత జరిగినప్పుడు కాంగ్రెస్ చేసిందేమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో సిక్కులను చంపిన ఘటనను దేశం ఇంకా మరిచిపోలేదని అన్నారు. బిహార్ ఐదో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బిహార్‌లోని పూర్ణియా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘కాంగ్రెస్ పార్టీ మత సహనంపై ఉపన్యాసాలు ఇస్తోంది, ఇలాంటి చర్యలు ఆ పార్టీకి గౌరవం తెచ్చే ప్రసక్తే లేదు’ అని ఆయన చెప్పారు. ఊచకోతకు గురైన సిక్కు కుటుంబాల కన్నీళ్లు తుడవలేదని ఆయన దుయ్యబట్టారు. వారి కష్టాలను మనం ఎలా మరిచిపోగలమని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ పార్టీ నాటకాలు ఆడుతోందని మోదీ విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లాలూ, నితీష్‌లు పాతికేళ్లపాటు రాష్ర్టాన్ని అధోగతిపాలు చేశారని, తాము గెలిస్తే రాష్ర్టాన్ని మళ్లీ గాడిలో పెడతామని మోదీ చెప్పారు. బిహార్‌కు విద్యుత్, రోడ్లు, నీరు తదితర సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. నవంబర్ 5న బిహార్‌లో చివరి దశ పోలింగ్ జరగుతుంది, 8న ఫలితాలు వెలువడనున్నాయి.