సర్కార్ కూల్చివేతకు భారీ కుట్ర: మోదీ

February 22, 2016 | 12:31 PM | 3 Views
ప్రింట్ కామెంట్
narendra-modi-Conspiracy-destabilise-NDA-government-niharonline

ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు, కొన్ని ఎన్జీవోలతో కలిసి కుట్ర చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ విరాళాల లెక్కలు అడుగుతున్నందుకు అసంతృప్తి, ఆగ్రహంతో రగిలిపోతున్న ఎన్జీవోలు, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వ్యక్తులు తనను అపఖ్యాతిపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఒడిశాలోని బార్‌గఢ్‌లో ఆదివారం జరిగిన రైతుల సభలో ప్రధాని ప్రసంగించారు.

 ‘చాయ్‌వాలా ప్రధాని అయ్యాడన్న వాస్తవాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నుతున్నారు’ అని మోదీ ఆరోపించారు. యూరియాను లూటీ చేసిన కెమికల్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు తనపై ఆగ్రహంగా ఉన్నాయన్నారు. విదేశీ విరాళాలు సేకరిస్తున్న ఎన్జీవోలను లెక్కలు సమర్పించాలని అడిగితే.. వారంతా కలిసి ఒక్కటై తనపై కక్ష గట్టారని మోదీ పేర్కొన్నారు.

‘వీరంతా కలసి ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలా అని ప్రయత్నిస్తున్నారు. వీటికి నేను భయపడను. ప్రజలు ఇచ్చిన బాధ్యత నుంచి తప్పుకోను’ అని ఆయన తేల్చిచెప్పారు. ఎన్డీఏ సర్కారు రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న సాగు పథకం, పంటల బీమా పథకం, భూసార కార్డుల పథకం సహా మరికొన్ని పథకాలను మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. దేశం రెండో హరిత విప్లవాన్ని సష్టించగలదని విశ్వసిస్తోందన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన పంటల బీమా పథకాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని మోదీ కోరారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ