పండగ రోజున పసిడి పథకాలకు శ్రీకారం

October 28, 2015 | 11:15 AM | 1 Views
ప్రింట్ కామెంట్
modi diwali glitter for govt gold monetisation scheme niharonline

దీపావళి పర్వదినాన దేశ ప్రజలకు బంగారు పథకాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోతుంది.  ఈ విషయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడే ఈ పథకాలను  దీపావళి రోజు ఆవిష్కరించనున్నట్లు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన వెల్లడించారు. గోల్డ్‌ మానిటైజేషన్‌ పథకం, సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల పథకం, అశోక చక్రతో కూడిన గోల్డ్‌ కాయిన్స్‌ వంటి పలు పథకాలు ఆరోజు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

మన దేశంలో జనజీవితంలో బంగారానికి చాలా ప్రాముఖ్యం ఉందని, ఆర్థిక భరోసాకు బంగారాన్ని ప్రతినిధిగా చూస్తారని చెప్పారు. అయితే బంగారాన్ని నిల్వ ఉంచే ధోరణి కన్నా, దాన్ని ద్వారా ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని చెప్పారు. ప్రతిభారతీయుడు ఈ పథకానికి ప్రోత్సాహమివ్వాలని కోరారు. ఆర్థికాభివృద్ధికి ఈ పథకాలు కొత్త మార్గాన్ని చూపుతాయని భావిస్తున్నట్లు చెప్పారు.

గోల్డ్‌ మానిటజేషన్‌ పథకం కింద బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి వడ్డీ పొందవచ్చని చెప్పారు. సొంత డబ్బులిచ్చి లాకర్లలో బంగారం దాచేబదులు, గోల్డ్‌ డిపాజిట్‌ చేసి బ్యాంకుల నుంచి వడ్డీ పొందడం మంచిదన్నారు. దీనివల్ల భద్రతతోపాటు వడ్డీ వస్తుందన్నారు. సావరిన్‌ బాండ్‌ పథకం ద్వారా బంగారం బార్లు కొనే బదులు అందుకు సమానమైన బాండ్‌ను కొనుగోలు చేయవచ్చని చెప్పారు. ఈ బాండ్‌కు బంగారం ధర ఉంటుందని చెప్పారు. బంగారం కొని దాన్ని దాచేందుకు ఇబ్బంది పడే బదులు, ఈ బాండ్లను కొనుక్కోవడం మంచిదని చెప్పారు. వీటిని ఎవరూ దోచుకోలేరని తెలిపారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇంకా విదేశీ గోల్డ్‌ కాయిన్స్‌ లేదా విదేశీయుల జారీ చేసే బంగారం కడ్డీలనే కొనుగోలు చేస్తున్నామని, వీటి బదులు స్వదేశీ గుర్తున్న నాణేలు కొనుగోలు చేయాలని, ఇందుకోసం అశోకచక్ర గుర్తుతో ఉన్న కాయిన్లను విడుదల చేస్తున్నామని చెప్పారు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో వీటిని కొనుగోలు చేయవచ్చునని ఆయన తెలిపారు.

బంగారం బాండ్ల ద్వారా 15 వేల కోట్ల రూపాయలను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు దేవాలయాల్లో, ఇళ్లలో నిరుపయోగంగా పడి ఉన్న 20 వేల టన్నుల బంగారాన్ని చెలామణిలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ