భారత్ మతతత్వం గురించి ఎక్కడా చెప్పలేదు

January 11, 2016 | 03:30 PM | 1 Views
ప్రింట్ కామెంట్
India has given spiritualism not communalism to world

మతం కొన్నిసార్లు సమస్యలను సృష్టిస్తుందని, అయితే ఆధ్యాత్మికత ఎల్లప్పుడూ సమస్యలకు పరిష్కారాలు చూపుతుందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 10 రోజులుగా ముంబైలోని సోమయ్య గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ఆధ్యాత్మికత సమాలోచన కార్యక్రమం ముగింపు ఆదివారం జరిగింది.  ఆచార్య రత్నసుందర్‌సురీశ్వర్జీ మహరాజ్ తాజా పుస్తకం ‘మై ఇండియా నోబెల్ ఇండియా’ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ, మరాఠీ భాషల్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన 30వేల మందిని ఉద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘భౌతికంగా నేను మీకు దూరంగా ఉండొచ్చు. అయితే మీ మనసుకు చాలా సన్నిహితంగా ఉన్నాను. శిరసు వంచి ఆచార్య పవిత్ర పాదాలకు వందనం చేస్తున్నా’నన్నారు. వివిధ రకాల సామాజిక దురాచారాలపై ఆయన తన పుస్తకాల్లో రాశారన్నారు. అన్ని మతాల కంటే జాతీయత గొప్పమతమన్నారు. సుందర్ మహరాజ్ అనేక సామాజిక రుగ్మతలను వెలుగులోకి తెచ్చి వాటిని ఖండించారని మోదీ అన్నారు. ఆయన రచనలు భారత సాంస్కృతిక జాతీయతను ప్రతిబింబిస్తాయన్నారు. రాష్ట్రధర్మం గురించి రత్నసుందర్ సురీశ్వర్జీ బోధనలు అనుసరణీయాలని ఆయన అన్నారు.

               భారత్ ప్రపంచానికి ఆధ్యాత్మికతను బోధించిందే తప్ప మతతత్వం గురించి చెప్పలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అన్ని మతాల కంటే ‘రాష్ట్ర ధర్మ’(దేశానికి సేవ చేయటం) మహోన్నతమైనదని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికత అనేది భారతీయ వారసత్వ ఆస్తి అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విశ్వసించేవారని, మానవాళి ఎదుర్కొంటున్న పెను సమస్యలకు అది పరిష్కారం చూపుతుందని అన్నారు. ఫలానా మతానికే బద్ధులుగా ఉండాలని భారత్ ఎన్నడూ ప్రపంచానికి చెప్పాలని ప్రయత్నించలేదని, ఈ విషయమై మనం అర్థం చేసుకున్నట్లు ప్రపంచం మనల్ని సరిగా అర్థం చేసుకోలేదని విచారం వ్యక్తంచేశారు.

సుందర్ గొప్ప సామాజిక సంస్కర్త, ఆధ్యాత్మిక నాయకుడని అభివర్ణించారు. విశ్వంలోని అన్ని రకాల అంశాలపై ఆయన తన పుస్తకాలతో భావాలను వ్యక్తపరిచారని మోదీ కితాబిచ్చారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ