పాకిస్థాన్‌ను మెప్పించేందుకు జైష్ ఎ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను నెత్తిన పెట్టకున్న చైనాకు మోదీ సర్కారు సరైన రీతిలో సమాధానం ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి ద్వారా అజహార్ పై నిషేధం విధింప చేయాలన్న భారత్ యత్నాలకు గండి కొడుతూ పాక్ కి చైనా సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు చైనా తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులను మోదీ సర్కారు కల్పిస్తోంది.
చైనా ఉగ్రవాదిగా ముద్ర వేసిన డోల్కున్ ఇసాకు భారత్ వీసా మంజూరు చేసింది. వల్డ్ యుగ్యూర్ కాంగ్రెస్ నాయకుడైన డోల్కున్ ఇసా భారత్‌లో ఉంటోన్న బౌద్ధమత పెద్ద దలైలామాను కలుసుకోనున్నారు. చైనాలో ముస్లింల ఆధిపత్యం ఉన్న గ్జింజియాంగ్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదానికి వల్డ్ యుగ్యూర్ కాంగ్రెస్ నేతలు మద్దతిస్తున్నారని చైనా ఆరోపిస్తోంది. రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసిన డోల్కున్ ఇసాకు భారత్ వీసా మంజూరు చేయడంపై డ్రాగన్ కన్నెర్ర చేసింది.
డోల్కున్ ఇసా ప్రస్తుతం జర్మనీలో ఉంటున్నారు. భారత్‌లోని హిమాచల్ ప్రదేశ్‌లో దలైలామాను కలిశాక ప్రజాస్వామ్యంపై సదస్సు నిర్వహించనున్నారు. ఇది చైనాను మరింత ఇరుకున పెట్టే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా చైనా పరువు మరింత దిగజారే అవకాశం ఉంది.
గ్జింజియాంగ్ ప్రావిన్స్‌లో యుగ్యూర్ తెగకు చెందిన ముస్లింల జనాభా కోటి మంది ఉంటారు. ఇక్కడ నిరంతరం అల్లర్లు జరుగుతూ ఉంటాయి. ఈస్ట్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ అనే ఉగ్రవాద సంస్థ చైనాలో దాడులకు, పేలుళ్లకు తోడ్పడుతోందని చైనా ఆరోపిస్తోంది.
భారత్ తాజాగా తీసుకున్న నిర్ణయం ద్వారా పాకిస్థాన్‌ను మెప్పించేందుకు మసూద్ అజహార్‌ను నెత్తిన పెట్టుకోవడం ఎంత తప్పో తెలిసి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటిదాకా యూరప్‌లో తలదాచుకున్న డోల్కున్ ఇసా ఇకపై భారత్‌లోనే ఉంటూ చైనాకు పక్కలో బల్లెంలా మారే అవకాశం ఉంది.