ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భేటీ మరికాసేపట్లో జరగనుంది. ఈ సమావేశం కోసం గురువారం రాత్రే కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రధాని వద్ద ప్రస్తావించాల్సిన అంశాలను కేసీఆర్ మరోమారు పరిశీలించుకున్నారు. కేంద్ర బడ్జెట్ కు ముందు ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్, కొత్త రాష్ట్రం కింద తెలంగాణకు రావాల్సిన కేంద్రం నిధులు, ఆర్థిక సంఘం కింద అందే నిధులు, ప్రత్యేక ప్యాకేజీ తదితరాలపై మోదీతో చర్చించనున్నారు.
అదే సమయంలో తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, ధర్మల్ పవర్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు హాజరుకావాలని కూడా ఆయన ప్రధానిని ఆహ్వానించనున్నట్లు సమాచారం. ప్రధానితో సమావేశం అనంతరం భేటీ విషయాలను, ప్రధాని తెలంగాణ పర్యటనను కేసీఆర్ మీడియాకు వివరించనున్నారు.