భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రొటోకాల్ నిబంధనలను పక్కనబెట్టడం అలవాటు అయిపోయింది. అబూదాబీ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జయీద్ అల్ నహ్యాన్ భారత పర్యటనకు వచ్చిన వేళ పాలెం ఎయిర్ పోర్టుకు స్వయంగా వెళ్లి స్వాగతం పలికారు. నిజానికి ఆయనకు స్వాగతం పలకడానికి ప్రధాని మోదీ వెళ్లనక్కర్లేదు. కానీ, రెండు దేశాల మధ్యా ద్వైపాక్షిక బంధం మరింతగా పెరిగేలా చూడాలన్న కోరికతో మోదీ దేశానికి వస్తున్న అతిథికి స్వాగతం పలికారు. విమానాశ్రయంలో అల్ నహ్యాన్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న మోదీ ఆయన కాన్వాయ్ బయలుదేరి వెళ్లేంతవరకూ ఉన్నారు.
మోదీ ప్రధాని హోదాలో ఇలా ప్రొటోకాల్ పక్కన పెట్టడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చిన సమయంలోనూ ఆయన విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలికారు. కాగా, ఈ రోజు మధ్యాహ్నం అల్ నహ్యాన్ గౌరవార్థం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేక విందును ఇవ్వనున్నారు.