భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి ప్రశంసల జల్లు కురిపించాడు. మోదీ నిజాయితీ కలిగిన వ్యక్తి అని, భారత అభివృద్ధికి సంబంధించి స్పష్టమైన విజన్ ఉన్న రాజకీయ నాయకుడని కితాబిచ్చారు. దేశాన్ని ఏ స్థాయికి, ఎలా తీసుకెళ్లాలనే విషయంపైనా మోదీకి ఒక విజన్ ఉందని, ఇది ఆయనను సమర్థ రాజకీయ నాయకుడినే కాకుండా.. సమర్థ ప్రధానమంత్రిగా నిలుపుతోందని కొనియాడారు. ఇరు దేశాల మధ్యా సంబంధాలు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయనకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు.
ప్రగతిపథంలోకి తీసుకెళ్లడానికి మోదీకి స్పష్టమైన విజన్ ఉంది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై మంచి అవగాహన కలిగి ఉన్నారు. వాస్తవ పరిస్థితులపై పూర్తిస్థాయి పట్టు ఉంది అనే అభిప్రాయాన్ని ఒబామా వ్యక్తం చేశారని విలేకరులకు వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ వివరించారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్యారిస్‌లో జరిగిన పర్యావరణ మార్పుల సదస్సు సందర్భంగా మోదీ, ఒబామాలు కలుసుకున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇరుదేశాల మధ్య పటిష్ఠమైన సంబంధాలను వివరిస్తూ వైట్‌హౌస్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మోదీ చురుకైన రాజకీయవేత్త అని, భారత ప్రధానిపై ఒబామాకు ఎనలేని గౌరవముందని ఎర్నెస్ట్ తెలిపారు.