ఇతరులతో సమానంగా వికలాంగులకూ అవకాశాలు లభించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా వారు నూతన శిఖరాలకు చేరుకోవడానికి వీలు కల్పించే ప్రపంచాన్ని సృష్టించడానికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం ఆయన ట్విటర్ ద్వారా సందేశం ఇచ్చారు. అంతేకాదు వారికోసం అసెసబుల్ ఇండియా పేరిట కొత్త పథకం ప్రకటించారు. పలు కేటగిరీలలో ఉన్న వికలాంగుల కోటాను పెంచేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని ఆయన అన్నారు.
అంగవైకల్యం ఉన్నవారిలో ఉన్న స్ఫూర్తికి తాను వందనం చెబుతున్నట్లు పేర్కొంటూ- వారే నిజమైన కథానాయకులని అభివర్ణించారు. వికలాంగులకు సమాన అవకాశాలు కల్పించడానికి బద్ధులమై ప్రతిజ్ఞ చేసుకోవాల్సిన రోజు ఇది అని చెప్పారు. వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో క్రెడిల్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వందలాది మంది వికలాంగులు ప్రదర్శన నిర్వహించారు.