తీసుకోవాల్సింది సాహసోపేతమైన నిర్ణయమే!

January 22, 2016 | 01:19 PM | 3 Views
ప్రింట్ కామెంట్
modi-jaitley-GST-bill-to-defence-niharonline

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ కలల బిల్లుగా చెప్పుకున్న జీఎస్టీ ఇప్పటిదాకా కలగానే మిగిలిపోయింది. ప్రధాని హోదాలో మోదీ సోనియా ఇంటికి వెళ్లినా ఫలితం లేకపోయింది. మోదీ స్వయంగా బరిలోకి దిగి పావులు కదుపుతున్నప్పటికీ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఏం చేస్తున్నట్లు? జీఎస్టీ బిల్లును పాస్ చేయించుకునే దిశగా ఆయన చేసిన చర్యలేంటనే చర్చ ప్రస్తుతం ఢిల్లీ రాజకీయ, అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇలాగైతే కుదరదు... జైట్లీ శాఖను మార్చడం ఖాయమన్న వాదన కూడా వినిపిస్తోంది.

                                       గతంలో ఆర్థిక శాఖతో పాటు రక్షణ శాఖను కూడా జైట్లీ పర్యవేక్షించారు. అయితే గోవా సీఎం పదవికి మనోహర్ పారికర్ తో రాజీనామా చేయించి మరీ రక్షణ శాఖ బాధ్యతలను మోదీ ఆయన నుంచి తప్పించారు. తాజాగా జీఎస్టీ బిల్లు విషయంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో జైట్లీ నుంచి ఆర్థిక శాఖను తప్పించేందుకు మోదీ దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జైట్లీకి రక్షణ శాఖను అప్పగించేసి, విద్యుత్ శాఖ మంత్రిగా మెరుగ్గా రాణిస్తున్న పీయూష్ గోయల్ కు ఆర్థిక శాఖ పగ్గాలను అప్పజెప్పే దిశగా మోదీ యోచిస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. నిరంతర విద్యుత్ సరఫరా విషయంలో గోయల్ తనదైన శైలిలో రాణించి సత్ఫలితాలు రాబట్టారు. అయితే, రాజకీయ అనుభవం అంతగా లేని గోయల్ ఆర్థిక మంత్రిగా ఏ మేరకు రాణిస్తారన్న విషయంపై అధికార వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

                    వచ్చే ఏడాదిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా 2019 ఎన్నికకు మరింత ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని మోదీ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అమిత్ షాకు మరో మూడేళ్ల పాటు పార్టీ జాతీయ అధ్యక్ష పదవితో పాటు పాలనలో మెరుగైన ఫలితాలు సాధించే వారికి కీలక బాధ్యతలు అప్పగించే దిశగా మోదీ అడుగులేస్తున్నారు. అందులో భాగంగానే తన కేబినెట్ ను పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే జైట్లీకి స్థానచలనం తప్పదన్న భావన వ్యక్తమవుతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ