భారత దేశంలో ఉగ్రవాదం జాడలు కమ్ముకొస్తున్న టైంలో, తీసుకుంటున్న చర్యలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ పోలీస్ ఉన్నతాధికారులతో చర్చించారు. వీటితోపాటుగా మహిళల భద్రత ప్రధానాంశంగా ఈ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గుజరాత్ లోని రాణ్ ఆఫ్ కచ్ లో జరుగుతున్న అన్ని రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సదస్సులో రెండో రోజు ముగిసింది. ఈ సందర్భంగా మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పలు విషయాలను ట్వీట్ చేశారు. సైబర్ సెక్యూరిటీ, ప్రకృతి విపత్తుల నిర్వహణ వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పూర్తిగా రెండు రోజులు గుడారాల్లోనే గడిపిన మోదీ మధ్యలో అధికారుల సమావేశాలకు హాజరైన వాటిని ఆసక్తిగా తిలకించారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర హెం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సహాయ మంత్రులు కిరణ్ రిజిజు, హరిభాయ్ చౌదరి పాల్గొన్నారు. సమావేశానికి కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో డీజీపీలు, ఐజీలతోపాటు ఎన్ఐఏ, సీబీఐ, ఐబీ విభాగాల అధికారులు హాజరయ్యారు. ఇక సతీసమేతంగా రావాలన్న ప్రధాని ఆహ్వానం మేరకు 60 మంది ఉన్నతాధికారులు తమ భార్యలతో సహా ఈ సదస్సుకు హాజరయ్యారు. ఉదయం దాదాపు 200 మంది అధికారులతో కలిసి మోదీ యోగా కూడా చేశారు.