అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన సూట్ పై జరిగిన రచ్చ తెలిసిందే. ప్రతిపక్షాలు ఈ సూట్ ను బేస్ చేసుకునే మోదీపై కుప్పలు కుప్పలుగా విమర్శలు గుప్పించారు. అంతటి పాపులర్ అయిన ఆ సూట్ ను వేలం వేయగా లాల్జీ భాయ్ అనే వ్యాపార వేత్త 4 కోట్ల 31 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. సూరత్ వజ్రాల వ్యాపారి, ప్రైవేట్ ఎయిర్ లైన్ యజమాని అయిన లాల్జీభాయ్ సూట్ పై 'నరేంద్ర దామోదర్‑దాస్ మోదీ' పేరు ఉండటంతో పోటీ పడి మరీ వేలంలో సూట్ ను దక్కించుకున్నాడు. ఆ టైంలో ఓ సూట్ కోసం అంత పెట్టలా అని విమర్శలు వినిపించాయి. అయితే ఆయనలో జనాలకు తెలియని మరో కోణం ఉంది. కుబేరుడైన లాల్జీభాయ్ పటేల్ సాయం చేయడంలోనూ ఆయనది పెద్ద మనసు. దేశ వ్యాప్తంగా పేద అమ్మాయిలకు వివాహాలు చేయడం కోసం 200 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు.
దేశ వ్యాప్తంగా 10 వేలమంది బాలికల తల్లిదండ్రులను ఎంపిక చేసి, అమ్మాయిల వివాహాల కోసం ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు లాల్జీభాయ్ చెప్పారు. వచ్చే మార్చి 13న సూరత్ లో ఈ పథకం ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఓ స్వచ్ఛంద సంస్థ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సాధ్వి రీతంబరను స్ఫూర్తిగా తీసుకుని పేద పిల్లలను ఆదుకునేందుకు ముందుకు వచ్చినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రచార కార్యక్రమం 'బేటీ బచావో, బేటీ పదావో'లో భాగంగా తన వంతు సాయం చేస్తున్నట్టు తెలిపారు.