కేరళ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ ప్రధాని మోదీ పాలక్కాడ్ లో శుక్రవారం ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ఆధ్వర్యంలోని అధికార యూడీఎఫ్ సంకీర్ణ ప్రభుత్వంతోపాటు సీపీఎంపై నిప్పులు చెరిగారు. ఓ దళిత విద్యార్థినిపై అత్యాచారం జరిగితే ఇక్కడి ప్రభుత్వం స్పందించలేదని, చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టుగా లేదని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఓ యువతి దారుణంగా అత్యాచారం, హత్యకు గురై 9 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడమని మోదీ అన్నారు.
యూడీఎఫ్ ప్రభుత్వ హాయంలో జరిగిన సోలార్ ఉత్పత్తుల కొనుగోలు కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ, ఉత్తరప్రదేశ్ లోని తన నియోజకవర్గమైన వారణాసిలో చేపల వేట బోట్లకు డీజిల్ ఇంజన్లను సోలార్ ఇంజన్లుగా మార్పు చేశామని చెప్పుకొచ్చారు. ‘ఇదే విధానాన్ని కేరళలోనూ ఎందుకు అమలు చేయకూడదని నా ఆలోచన. కానీ ఒకవేళ కేరళకు వెళ్లి సోలార్ గురించి మాట్లాడితే అది కూడా ఏదో కుంభకోణమని ప్రజలు అనుకుంటారని భయపడ్డాను’ అని ప్రధాని అనగానే సభ నుంచి చప్పట్ల మోత మోగింది. సీపీఎం హింసాత్మక రాజకీయ పంథా అనుసరిస్తోందని, గత కొన్నేళ్ల కాలంలో ఎంతో మంది అమాయక బీజేపీ కార్యకర్తలు సీపీఎం కార్యకర్తల చేతుల్లో హత్యకు గురయ్యారని ఆయన ఆరోపించారు.