హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులపై దేశ ద్రోహం కేసుల విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఇవే హాట్ టాపిక్స్. అయితే లోక్ సభలో సుమారు 40 నిమిషాలకు పైగా సుదీర్ఘ ప్రసంగం చేసి, ప్రత్యర్థుల రెండు నాల్కల వ్యవహారాన్ని అపరకాళిలా చీల్చి చెండాడింది కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మ్రతి ఇరానీ.
బుధవారం లోక్ సభలో జరిగిన చర్చ సందర్భంగా మంత్రి స్మ్రతి ఇరానీ ప్రతి ఒక్కరి ఆరోపణలకు సమాధానమిస్తూ... ప్రతిపక్షాలకు రాజకీయ స్వప్రయోజనాలే తప్ప దేశహితం పట్టదంటూ ఆమె ఏకి పారేశారు.
తన మంత్రివర్గ సహచరురాలి ప్రసంగం పట్ల ప్రధాని మోదీ కూడా సంతుష్టులైనట్టున్నారు. అన్ని అంశాలపై ట్విట్టర్ వేదికగా స్పందించే ప్రధాని... స్మృతి ఇరానీ ప్రసంగంపై కూడా అక్కడే ఓ ట్వీట్ వేశారు. ఆమె ప్రసంగంతో కూడిన యూట్యూబ్ లింక్ ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ’స్మృతి ఇరానీ ప్రసంగాన్ని వినండి, సత్యమేవ జయతే‘ అంటూ ఓ పోస్ట్ చేశారు.