ఈసారి మంచి వర్షాలు కురుస్తాయన్న సమాచారం తనకెంతో ఆనందం కలిగించిందంటున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఈ యేడాది 10 శాతం వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక సమర్పించిందని ఆయన చెబుతున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... వర్షాలు పడితే ఎక్కడి నీటిబొట్టును అక్కడే ఒడిసిపట్టాలని కోరారు. మహారాష్ట్రలో పలు గ్రామాల్లో నీటి కరువు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి పొదుపులో భాగంగా స్పింకర్ల ద్వారా పంట పొలాలకు నీటిని అందిస్తామన్నారు. నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. దేశంలోని గ్రామాలు వికాసం వైపు పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. నాలాల నుంచి వస్తోన్న చెత్త గంగానదిని కలుషితం చేస్తోందని తెలిపారు. గంగానదిలో తరచూ 3 నుంచి 11 టన్నుల చెత్త తొలగిస్తున్నామన్నారు. గంగానది పరిశుభ్రతకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కానీ, ప్రజల భాగస్వామ్యం లేనిదే గంగానది ప్రక్షాళన సాధ్యం కాదన్నారు.