దేశ ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 17న జమ్ము కశ్మీర్ సందర్శిస్తున్నారు. కశ్మీర్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత గిరిధర్ లాల్ డోగ్రా శతజయంతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధాని జమ్మూలో పర్యటిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. జమ్ములోని కథువా జిల్లాలో జన్మించిన డోగ్రా అగ్రశ్రేణి కాంగ్రెస్ నాయకుడుగా ఎదిగారు. డోగ్రా కుమార్తెను ప్రస్తుత కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వివాహం చేసుకున్నారు. పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ జమ్ముకు 70 వేల కోట్ల రూపాయల అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించవచ్చునని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే జమ్మూలో ఎయిమ్స్ నిర్మించనున్నట్లు ప్రకటించవచ్చు. ఇప్పటికే కాశ్మీర్ వ్యాలీలో ఎయిమ్స్, జమ్మూ ప్రాంతంలో ఐఐటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పీడీపీ బీజేపీ కూటమి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో మోదీ పర్యటనతోపాటు రాష్ట్రానికిచ్చే ఆఫర్లపై సర్వత్రా ఆసక్తినెలకొంది.