పఠాన్ కోట్ దాడి విషయంపై ప్రధాని నరేంద్రమోదీ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ఇప్పటికే మాట్లాడారని భారత విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. తగిన చర్యలు తీసుకుంటామని షరీఫ్ హామీ ఇచ్చారని, ఆయన తీసుకోబోయే చర్యలకోసం ఇప్పుడు ఎదురుచూస్తున్నామని తెలిపారు.
బంతి ఇప్పుడు పాకిస్థాన్ కోర్టులోనే ఉందని, పఠాన్ కోట్ దాడికి తగిన చర్యలు తీసుకునేందుకు నిఘా విభాగం సమాచారం కూడా అందుబాటులో ఉందని అన్నారు. ఫోన్ సంభాషణలో వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. పఠాన్‌కోట్‌పై పాక్ ఎలాంటి డెడ్‌లైన్ ఇవ్వకుండా.. చర్చలు కష్టం’ అని మోదీ షరీఫ్ తో అన్నట్లు పేర్కొన్నారు. పాక్ ప్రధానితో ఫోన్ సంభాషణలో.. ఉగ్రవాదంపై కఠిన చర్యలపైనే మోదీ పట్టుబట్టారని వెల్లడించారు. పాక్ నుంచి భారత్‌లో విధ్వంసానికి జరుగుతున్న ప్రణాళికలపై చర్యలు తీసుకోవాలని గట్టిగానే చెప్పారని.. దీనికి పాక్ ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. పఠాన్ కోట్ దాడితో మరోసారి, సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యల అంశం కీలకంగా మారిందని, దీనిపై మరింత దృష్టిని సారిస్తామని వికాస్ చెప్పారు.