అందరినీ ఆకర్షించే మోదీ నయా మంత్రం

November 23, 2015 | 12:18 PM | 1 Views
ప్రింట్ కామెంట్
PM-Modi-tamil-speech-in-malasiya-niharonline

వరుస విదేశీ పర్యటనల్లో బిజీగా ఉంటున్న మన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ప్రవాస భారతీయులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో ప్రసంగించిన మోదీ అక్కడి ఎన్నారైలతో కేరింతలు కొట్టించారు. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ వేదికగా జరిగిన మోదీ బహిరంగ సభ భారత్ అనుకూల నినాదాలతో హోరెత్తింది. నిన్నటికి నిన్న బ్రిటన్ పర్యటనలో భాగంగా మోదీ ప్రభావం ఏకంగా ఆ దేశ ప్రధాని కామెరూన్ సతీమణి చేత చీర కట్టుకునేలా చేసింది. ఇవన్నీ ఆయనకున్న పాపులారిటీకి జస్ట్ ఎగ్జాంఫుల్ మాత్రమే. అయితే పాపులారిటీ తగ్గుతుందనుకుంటున్న సమయంలో ఆయన ఉపయోగించే ఏకైక మంత్ర దండం భాష. అవును. ఎలాంటి ప్రాంతానికి వెళ్లినా వారి వారి భాషల్లో మాట్లాడితే ఆ కిక్కే వేరు. ఆ సూత్రాన్నే ఫాలో అవుతున్నారు మోదీ. అంతేందుకు అమరావతి పర్యటన సందర్భంగా కాసేపు తెలుగులో ప్రసంగించి ఆయన ఆశ్చర్యపరిచారు.

                     ఇక తాజాగా ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సుకు వెళ్లిన సందర్భంగా మోదీ ఆదివారం మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. మలేసియాలో ఉన్న ప్రవాస భారతీయుల్లో మెజారిటీ తమిళులదే. మెజారిటీ అనే కంటే అక్కడ ఉన్న ప్రవాస భారతీయులంతా దాదాపుగా తమిళులే. ఈ విషయంపై అవగాహన ఉన్న నరేంద్ర మోదీ తమిళంలో తన ప్రసంగాన్ని మొదలుపెట్టి అక్కడి వారిని ఉత్సాహపరిచారు. మోదీ నోట తమిళ మాట వినపడటంతో అక్కడి తమిళులు కేరింతలు కొట్టారు. అలా మొదలైన ఆయన ప్రసంగం చివరిదాకా ఉత్సాహభరితంగా సాగటం విశేషం. మొత్తం 45 నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో తమిళ కవి తిరువళ్లూరు ప్రస్తావన కూడా ఆయన తీసుకొచ్చారు. ఈ విషయాన్ని మనతోపాటు మలేషియా మీడియా కూడా హైలెట్ చేస్తూ ప్రముఖంగా ప్రసారం చేశాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ