ఇటీవలె చైనాలో పర్యటించాలని నిర్ణయించుకున్న ప్రధాని మోదీ తాజాగా మరో నాలుగుదేశాల పర్యటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఫ్రాన్స్, జర్మనీ, చైనా, రష్యా,శ్రీలంక ఇలా వరుస దేశాల పర్యటనలతో ఆయన బిజీగా గడపబోతున్నాడు. ఏప్రిల్‌లో తమ దేశంలో పర్యటించాల్సిందిగా ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫాబియస్ తనను ఆహ్వానించిన విషయాన్ని మోదీ ఈ మధ్యే స్వయంగా వెల్లడించారు. దీంతో ఆయన మొదటగా ఫ్రాన్స్ వెళ్లనున్నారు. అనంతరం ఏటా ఏప్రిల్‌లో నిర్వహించే హనోవర్ పారిశ్రామిక ప్రదర్శనకు హాజరయ్యేలా ప్రధాని మోదీ జర్మనీ పర్యటన ఖరారుకానున్నట్లు తెలిసింది. ఆ తర్వాత మే 26 నుంచి చైనాలో పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆపై జులైలో బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యాకు వెళ్లనున్నారు. వీటితోపాటు శ్రీలంకలోనూ మోదీ పర్యటిస్తారని, ఈ నెల జరగబోయే లంక అధ్యక్షుడి భారత పర్యటన ముగిసిన తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధులు తెలిపారు.