నాన్న, నాన్నమ్మలను గుర్తుచేసి నోరు మూయించాడు

March 03, 2016 | 03:15 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Modi hits back at Congress quotes Rajiv Indira Gandhi

కోట్ల కొద్దీ ప్రజాధనం వృథా అయిపోతుంది. ఈసారి అలా కానివ్వం, ఎట్టి పరిస్థితుల్లో సభా సమయం వృథాకానీవ్వం బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలివి. జేఎన్ యూ, రోహిత్ ఆత్మహత్య తదితర అంశాలు పార్లమెంటను స్తంభింపజేస్తాయని ముందే భావించిన మోదీ ముందుగానే వెంకయ్య లాంటి కీలకనేతలతో దౌత్యం నడిపి సభా సజావుగా సాగేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఆ టైంలో సానుకూలంగానే స్పందించిన ప్రతిపక్షాలు ఆ తర్వాత మాట మార్చాయి.

              నల్లధనం వెలికితీస్తామని చెప్పుకుని గద్దెనెక్కిన ప్రధాని మోదీ, ఆ తర్వాత నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ మంత్రాన్ని పఠిస్తున్నారని రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో నేటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం మైకందుకున్న మోదీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, నాన్నమ్మ ఇందిరాగాంధీ గతంలో చేసిన పలు వ్యాఖ్యలను నరేంద్ర మోదీ ప్రస్తావించారు.

                          పార్లమెంటు సభ్యుడిగా ప్రతి ఎంపీపై గురుతర బాధ్యత ఉంటుందని రాజీవ్ గాంధీ చెప్పారని మోదీ అన్నారు. ప్రజలు మనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించామా? లేదా? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని కూడా రాజీవ్ చెప్పారన్నారు. సమస్యలు పరిష్కరించే వేదికగా పార్లమెంటు ఉండాలని ఇందిరాగాంధీ ఆకాంక్షించేవారని గుర్తుచేశారు. తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టిన ఎంపీలకు మాట్లాడే అవకాశమివ్వాలన్నారు. వారి వద్ద ఎన్నో మంచి సూచనలు ఉన్నాయన్నారు.

                    ఆపై కాంగ్రెస్ వైఖరిపై నిప్పులు చెరిగిన మోదీ, కాంగ్రెస్ ప్రతిపాదించిన జీఎస్టీ బిల్లును ఆ పార్టీ ఎంపీలే తిరస్కరించడం తనకు అర్ధం కావడం లేదని కూడా మోదీ ఎద్దేవా చేశారు. పార్లమెంటులో ప్రజా సమస్యలపై కాకుండా ఏదో ఒక అంశం కేంద్రంగా జరుగుతున్న రచ్చపై ప్రధాని నోరు విప్పటంతో అధికార సభ్యుల్లో ఉత్సాహం నెలకొంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ