మరాఠీల ఆరాధ్యదైవం, శివసేన వ్యవస్థాపకుడు, బాల్ థాక్రేకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఆయన వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ లో ప్రశంసించారు. "బాల్ థాక్రే ఎల్లప్పుడూ ప్రజాసంక్షేమానికే కట్టుబడి ఉండేవారు. కార్యకర్తలు ఆయనను ఎంతగానో ఆరాధించేవారు. ఆయన పుణ్యతిథి సందర్భంగా నివాళులర్పిస్తున్నా" అంటూ మోదీ ట్వీట్ చేశారు.
బాలాసాహెబ్ థాక్రే దాదాపు ఐదు దశాబ్దాల పాటు మహారాష్ట్ర రాజకీయాలలో కాకుండా దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన విలక్షణ వ్యక్తి బాల్ థాకరే. 1950లలో రాజకీయ వ్యంగచిత్రకారుడిగా (కార్టూనిస్టుగా) జీవనం ప్రారంభించిన థాకరే 1960 నాటికి సొంత రాజకీయ వారపత్రికను ప్రారంభించాడు. ముంబాయిలో మహ్రాష్ట్రేతరుల ఆధిపత్యాన్ని సహించక వారికి వ్యతిరేకంగా కార్టూన్లు వేసేవాడు. ఆ తర్వాత మరాఠా ప్రజల హక్కుల సాధనకై పోరాటం చేయడానికి 1966లో శివసేన పార్టీకి ఏర్పాటుచేశాడు. "మహారాష్ట్ర మహారాష్ట్రీయులకే' అనే ఉద్యమంలో భాగంగా ముంబాయిని వదిలిపోవాలని ప్రవాసులను హెచ్చరించాడు. హిందూత్వను, హిందూ జాతీయవాదాన్ని కూడా బలపర్చాడు. జాతీయ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీతో జతకట్టి కీలక పాత్ర వహించాడు. శివసేన పార్టీ స్థాపించిననూ 1995లో మహారాష్ట్రలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిననూ బాల్ థాకరే మాత్రం ప్రత్యక్ష రాజకీయాలలోకి రాలేడు, ఎన్నికలలో పోటీచేయలేడు. పార్టీ అధినేతగానే ఉంటూ పార్టీని నడిపించాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనుకంజ వేయలేడు. 86 ఏళ్ళ వయస్సులో నవంబరు 17, 2012న ముంబాయిలోని తన నివాసం మాతోశ్రీలో ఆయన తుది శ్వాస విడిచాడు.