ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఉగ్రవాదంతో గజగజలాడిపోతుంది. నిన్న గాక మొన్న పారిస్ లో జరిగిన నరమేథంలో 130 మందికి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మానవత్వం లేని ఆ ఐఎస్ఐఎస్ రాక్షసులు తప్పా ప్రతీ ఒక్కరూ ఆ మారణకాండను వ్యతిరేకించారు. అయితే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ ఉగ్ర భూతాన్ని అంతం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ-20 ముందు పది సూత్రాల పథకాన్ని ఉంచారు.
మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఉగ్రవాదమేనని పేర్కొన్న ఆయన, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వివిధ దేశాల్లో విస్తరిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఐఎస్ఐఎస్ రిక్రూట్ మెంట్లు నిలిపివేయాలని, వారికి సాంకేతికత అందకుండా చూడాలని అన్నారు. వారికి ఇంటర్నెట్ కూడా లేకుండా చేయాలని అన్నారు. ఉగ్రవాదానికి, మతానికి సంబంధం లేదని, ఏ రూపంలో ఏ దేశంలో ఉన్నా ఉక్కుపాదంతో తుదముట్టించాల్సిందేనని మోదీ ప్రకటించారు. ఉగ్రవాదులకు నిధులందిస్తున్న వారిని నిలువరించాలని, ఇతర దేశాల నుంచి మద్దతు పలుకుతున్న వారిని అదుపు చేయాలని కూడా మోదీ సూచించారు. మోదీ చేసిన సూచనలను వెంటనే అమలు చేయాలని పలువురు జీ-20 నేతలు అభిప్రాయపడ్డారు.