ఇంట ఎలాగూ గెల్వలేదు కదా కనీసం రచ్చనైనా గెలవాలని ప్రధాని నరేంద్ర మోదీ డిసైడ్ అయిపోయారు. బీహార్ ఎన్నికల్లో ఓటమితో కాస్త దిగాలుగా కనిపించిన మోదీ, కనీసం బ్రిటన్ పర్యటనలో అయిన గెలవాలని ఉబలాటపడుతున్నారు. ఎలాగైనా సరే బ్రిటన్ పారిశ్రామికవేత్తలను గెలిచి ఇండియాకు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు తీసుకురావటం ఇప్పుడు ఆయన ముందున్న సవాల్. సుమారు 15 బిలియన్ డాలర్లు (సుమారు రూ. లక్ష కోట్లు) విలువైన వాణిజ్యం, పెట్టుబడులను టార్గెట్ చేసినట్లు సమాచారం.
బుధవారం నాడు నరేంద్ర మోదీ, మూడు రోజుల పర్యటన నిమిత్తం తొలిసారిగా బ్రిటన్ కు బయలుదేరి వెళ్లనున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ తో లంచ్, వాంబ్లే స్టేడియంలో తన గౌరవార్థం జరిగే ఓ పెద్ద రిసెప్షన్ లో పాల్గొననున్నారు. ఇక బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, మోదీ పర్యటన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారుట. కాగా, మోదీ పర్యటనను అడ్డుకోవాలని అవాజ్ నెట్ వర్క్ తదితర సంస్థలు ప్రయత్నిస్తాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో బ్రిటన్ సర్కారు అప్రమత్తమైంది.
ఇదిలా ఉంటే బీహార్ ఫలితాలను ఆసరాగా చేసుకుని అక్కడి మీడియా మాత్రం మోదీ పర్యటనపై చతురులు, వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇండియాలో బీజేపీ కష్టాలు, బ్రిటన్ పర్యటనలో ఆయన్ను నీడలా వెంటాడనున్నాయని కథనాలు ప్రచురించింది., ప్రస్తుతానికి బ్రిటన్ ఇన్వెస్టర్లు మోదీకి దూరంగానే ఉండవచ్చని 'ది ఇండిపెండెంట్' అభిప్రాయపడింది. ప్రపంచాన్ని 'రాక్' చేసిన ఓ వ్యక్తి స్వదేశంలో చతికిలబడ్డారని 'డైలీ టెలిగ్రాఫ్' వెల్లడించింది. అయితే అవేం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని మెజార్టీ మీడియా సంస్థలు రాయటం విశేషం.