ఓవైపు నేషనల్ హోరాల్డ్ పత్రిక కుంభకోణం కేసులో సోనియాగాంధీపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు తనయుడు రాహుల్ గాంధీ లకు కూడా అందులో హస్తం ఉందని కమలనేతలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రధాని మోదీ మాత్రం పన్నెత్తు మాట అనకుండా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎందుకో అనుకోకండి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేడు(డిసెంబర్ 9న) 69వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలియజేశారు. "శ్రీమతి సోనియాగాందీ జన్మదినోత్సవం పురష్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భగవంతుడు ఆమెకు ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయువును ప్రసాదించాలి" అని మోదీ ట్వీట్ చేశారు.
మరోవైపు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా సోనియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, గతేడాది ఛత్తీస్ గఢ్ నక్సల్స్ దాడులు, కశ్మీర్ తీవ్రవాదుల దాడుల్లో బలైన జవాన్లకు సంతాప సూచకంగా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు సోనియా ప్రకటించిన విషయం తెలిసిందే.