నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారానికి వచ్చిన తరువాత విదేశాంగ విధానంలో పలు విప్లవాత్మక మార్పులు చోటుచేసుకొంటున్నాయి. దౌత్య వ్యవహారాలలో బ్యూరోక్రసీని పక్కన పెట్టి ప్రధాని మోదీ వ్యక్తిగతంగా చురుకయిన పాత్రను పోషిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు చెప్పుకోదగింది మోదీ సౌదీ పర్యటన గురించి. గతంలో భారతీయ ప్రధానులు గల్ఫ్ దేశాల్లో పర్యటించినప్పటికీ, ఈ పర్యటనకు చాలా తేడా ఉంది. దీనికి కారణం లేకపోలేదు.
నెహ్రూ నుంచి మన్మోహాన్ సింగ్ వరకు (ఇందిరా గాంధీని మినహాయించి) ఎవరూ కూడా తమ హయాంలో ఒకటికి మించి ఏ గల్ఫ్ దేశాన్ని సందర్శించలేదు. కానీ, మోదీ ఆ రికార్డు బద్ధలు కొడుతూ కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో రెండు గల్ఫ్ దేశాలలో పర్యటించారు. పైగా ఈ ఎడారి దేశాలకు వచ్చే సరికి మోదీ వ్యూహాత్మకంగా ఆమ్ ఆద్మీ విధానాన్ని ఎంచుకొని ఇక్కడి సగటు పేద కార్మికులను లక్ష్యంగా చేసుకున్నారు.
అత్యధికంగా 30 లక్షల మంది భారతీయులు సౌదీ దేశాల్లోనే పని చేస్తున్నారు. గతంలో కూడా యూఏఈ పర్యటన సందర్భంగా మోదీ ఆబుదాబి లేబర్ క్యాంపును సందర్శించి, కార్మికులతో మాటా మంతీ జరిపారు. అలాగే ఈ సారీ సౌదీ పర్యటనలో ప్రవాస కార్మిక సంక్షేమంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. గల్ఫ్ దేశాలలో ఇప్పటి వరకు ఏ ఇతర దేశాధినేత కూడా చేయని విధంగా తమ ప్రవాస కార్మికుల వద్దకు వెళ్ళి వారితో మాట్లాడడమే కాకుండా వారితో కలిసి భోజనం కూడా చేసి సంచలనం సృష్టించారు. అంతేకాదు అప్పుడు ఆయన చేసిన ప్రసంగం కార్మిక సగటు ప్రవాస కార్మికులలో ఒక ఉత్తేజాన్ని నింపింది, సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో సరళమైన భాషలో మాట్లాడారు. మీ చెమట నుంచి పరిమళ సువాసన తనను మీ వద్దకు తీసుకు వచ్చిందని మోదీ చెప్పినప్పుడు అనేకులు కళ్ళ నీళ్ళు పెట్టుకొన్నారు. ప్రస్తుత ఉద్యోగ ఒప్పందాలకు ప్రభుత్వాల పక్షాన చట్టబద్ధత లేకపోవడంతో, సౌదీ అరేబియాకు ఈ రాష్ర్టాల నుంచి ప్రతి రోజూ భారీ సంఖ్యలో ఉపాధి వీసాలపై వస్తున్న యువజనులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ఇప్పటి పర్యటన ఖచ్ఛితంగా సమ్ థింగ్ స్పెషలే.