రైతుల కష్టాల్లో తమ ప్రభుత్వం పాలుపంచుకుంటుందని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న కృషీ ఉన్నతి మేళాను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులనుద్దేశించి మాట్లాడుతూ వారిలో తమ ప్రభుత్వం పట్ల భరోసా నింపే ప్రయత్నం చేశారు.
వ్యవసాయ సాంకేతిక సమాచారంతో ప్రయోజనాలను గురించి ప్రస్తావించిన మోదీ.. ఆ సాంకేతిక అందరికీ చేరవేస్తామని అన్నారు. తాము చేయాలనుకున్నదంతా కచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ... తాము చేసిన అభివృద్ధిని ఇతరులు చేసినట్లు చెప్తున్నారన్నారు. కొన్ని చోట్ల ప్రాజెక్టులు కట్టారు కానీ రైతులకు మాత్రం నీరందలేదని విమర్శించారు. రైతులు ఆనందంగా ఉండాలంటే వేసవిలోనూ నీరు పుష్కలంగా ఉండాలన్నారు. వేసవిలోనూ నీటి పొదుపుపై అందరు ఆలోచించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.