పఠాన్ కోట్ ఉగ్రదాడిపై ప్రధాని మోదీపై తీవ్ర విమర్శల వెల్లువ కొనసాగుతున్న విషయం తెలసిందే. ఇద్దరు కాఫీ తాగి ఏడుగురిని బలి తీసుకున్నారంటూ ప్రతిపక్షాలు ఆయనపై విరుచుకుపడ్డాయి. మిత్రపక్షమైన శివసేన ఈ విషయంలో బీజేపీని తులనాడేందుకు అస్సలు వెనకాడలేదు. తొందరపడి చేసిన పనితో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని ప్రధానిపై విమర్శలు చేసింది. అయితే హిందుత్వ భావజాలాలు బలంగా ఉన్న ఆర్ఎస్ఎస్ మాత్రం ఆశ్చర్యకరరీతిలో బీజేపీకి మద్ధతు ప్రకటించింది. ప్రధానిని పాక్ పర్యటనను సమర్థించింది. మోదీ పాక్ పర్యటన తప్పేం కాదని, పైగా ఇది ఇరు దేశాల శాంతి ప్రక్రియకు నాంది లాంటిదని పేర్కొంది. పాక్ వెళ్లాలని మోదీ తప్పుడు నిర్ణయం తీసుకోలేదని, అయినా ప్రధానికి ఇటువంటి విషయాల్లో స్వయం నిర్ణయం తీసుకునే హక్కు ఉందని వెనకేసుకొచ్చింది. అయితే భారత్ పాకిస్తాన్ ల మధ్య చర్చలు జరగడంపై సంఘ్ కు కాస్త వ్యతిరేకత ఉన్నా, పొరుగుదేశంతో స్నేహసంబంధాలు వెల్లివిరియడానికి చర్చలు దోహదపడతాయని అభిప్రాయపడుతోంది. ఈ వ్యాఖ్యలతో కాస్త ఊరట కలగటం మాత్రం ఖాయం.