వరుస విదేశీ పర్యటనల్లో మొన్నటిదాకా బిజీగా ఉన్న మోదీ కాస్త విరామం ప్రకటించారు. అయితే త్వరలో ఆయన ఓ సాహస చర్యకు దిగనున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు, పాలనపైనే దృష్టి సారించిన ఆయన వచ్చే ఏడాదికి మరో విదేశీ పర్యటనను ఫిక్స్ చేసుకున్నారు. అది మరే దేశమో కాదు. మన పొరుగు దేశం పాకిస్థాన్. అవును భారత ప్రధాని నరేంద్ర మోదీ 2016లో దాయాది దేశం పాకిస్థాన్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ వెల్లడించారు. ప్రస్తుతం ఇస్లామాబాద్ లో జరుగుతున్న 'హార్ట్ ఆఫ్ ఏసియా' సదస్సుకు హాజరైన ఆమె అక్కడే ఈ విషయాన్ని కూడా తెలిపారు.
వచ్చే సంవత్సరం పాక్ లో జరిగే సార్క్ శిఖరాగ్ర సమావేశాలకు ప్రధాని మోదీ హాజరవుతారని చెప్పారు. మోదీతో పాటు తాను కూడా వస్తానని సుష్మా తెలిపారు. అన్నట్లు భారత్ తరపున 2004లో చివరి సారిగా ఓ భారత ప్రధాని పాక్ ను సందర్శించారు. అప్పుడు జరిగిన సార్క్ సమ్మిట్ కు నాటి ప్రధాని వాజ్ పేయి హాజరయ్యారు. ఇన్నేళ్ల తర్వాత తిరిగి మళ్లీ ఓ భారత ప్రధాని పాక్ లో అడుగుపెట్టనున్నాడన్న మాట.