నూతన అధ్యయాన్ని లిఖించే క్రమంలో భాగంగానే పొరుగుదేశం పాకిస్థాన్ తో చర్చలను పునఃప్రారంభిస్తున్నామని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఉగ్రవాద నిర్మూలనే తమ ప్రధాన లక్ష్యమన్న మోదీ, ఉగ్రవాద నిర్మూలనలో చూపించే చిత్తశుద్ధే పాకిస్తాన్ విశ్వసనీయతకు గీటురాయి అని విస్పష్టంగా తేల్చిచెప్పారు. మంగళవారం హిందూ మహా సముద్ర జలాలపై యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యపై త్రివిధ దళాధిపతులనుద్దేశించి మోదీ ప్రసంగించారు.
‘చరిత్రను మార్చడం, ఉగ్రవాదాన్ని అంతం చేయడం, శాంతియుత సంబంధాలను నెలకొల్పుకోవడం, ద్వైపాక్షిక సహకారంలో పురోగతి, సుస్థిరత, సౌభాగ్యతలతో ఈ ప్రాంతాన్ని విలసిల్లజేయడం లక్ష్యాలుగా పాక్‌తో చర్చలు మళ్లీ ప్రారంభిస్తున్నాం. అయితే, అందులో చాలా ప్రతికూల అంశాలు ఉన్నాయి. ఎన్నో సవాళ్లు, అడ్డంకులు చాలా ఉన్నాయి. అయినా, ప్రయత్నం చేయాల్సిందే. ఎందుకంటే, శాంతి వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మన తర్వాతి తరం ప్రమాదంలో ఉంది. వారిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. భద్రతాపరమైన అంశాల్లో నిపుణులైన ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల ముఖాముఖి చర్చలను ప్రారంభించాం’ అని వివరించారు. అలాగే చర్చలు ప్రారంభమయ్యాయి కదా అని భద్రతపై అప్రమత్తతను వదిలేయబోమని, ఉగ్రవాదంపై పొరుగుదేశం చిత్తశుద్ధిని పరీక్షిస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. కాగా, దేశ రాజధానికి ఆవల త్రివిధ దళాధిపతులతో ప్రధాని భేటీ కావడం ఇదే ప్రథమం.