దేశ ప్రజలనుద్దేశించి రేడియో ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ చేసే ప్రసంగం "మన్ కీ బాత్" 2016 లోనూ మొదలుపెట్టేశారు. మొదటిప్రసంగంలో భాగంగా భావి భారత నిర్మాణానికి అత్యంత కీలకమైన యువత ఖాదీ వస్త్రాలే ధరించాలని మోదీ పిలుపునిచ్చారు. 'మన్ కీ బాత్'లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ఖాదీకి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. దీని ద్వారా లక్షలాది మందికి ఉపాధి పెరుగుతుందని, ఇటీవలి కాలంలో యువత మోజు ఖాదీపై పడిందని, మరింత మంది వీటిని ధరించేందుకు మొగ్గు చూపాలని కోరారు. భారత సంప్రదాయ పరిశ్రమైన ఖాదీలో సౌరశక్తి వినియోగానికి పెద్ద పీట వేస్తామని అన్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలియజేశారు. ఆడపిల్లల సంరక్షణ, విద్యా కల్పన తదితర రంగాల్లో మరింత దృష్టిని కేంద్రీకరించినట్టు మోదీ పేర్కొన్నారు.
'బేటీ బచావో, బేటీ పడావో'కు మరింత ప్రోత్సాహం ఇస్తామని హామీ ఇచ్చారు. దేశ రక్షణ కోసం పాటుపడుతున్న సరిహద్దు భద్రతా సిబ్బంది అనునిత్యమూ సవాళ్ల మధ్య పని చేస్తున్నారని, వారి కృషి అభినందనీయమని అన్నారు. రైతులంతా పంటల బీమా చేయించుకోవాలని, తద్వారా అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడితే, జీవనం గడిచేందుకు అవసరమైన వనరులు సమకూరుతాయని అన్నారు. దేశ ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన మరింతగా పెంచేందుకు స్వచ్ఛ భారత్ కు మరిన్ని నిధులు కేటాయిస్తామని మోదీ తెలిపారు. మహాత్మాగాంధీ వర్ధంతి రోజున దేశ ప్రజలంతా మౌనం పాటించి, జాతి కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకున్నారని గుర్తు చేసిన ప్రధాని, ఏటా ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని సూచించారు. అభివృద్ధి పథంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుంటే, మరింత మెరుగైన ఫలితాలు లభిస్తాయని మోదీ వెల్లడించారు.