పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సజావుగా సాగేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలు ప్రారంభించారు. కీలకమైన జీఎస్టీ బిల్లు ఆమోదం పొందాల్సి ఉండటంతోపాటు, ప్రతిపక్షాలను దారిలోకి తెచ్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలను ఆయన ఇంటికి ఆహ్వానించి చర్చించారు. బిల్లులపై ప్రతిపక్షాల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రధాని వ్యూహాత్మకంగా వెళుతున్నారు.
విపక్ష నేతలతో సమావేశమైన ఆయన, కీలకమైన జీఎస్టీ, సంస్కరణల బిల్లుల అమలుకు సహకారం అందించాలని మోదీ కోరినట్టు సమచారం. ఈ వివరాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు మీడియాకు తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ వర్శిటీ ఘటన సహా అన్నింటిపైనా చర్చకు సిద్ధమేనని ప్రతిపక్షాలకు స్పష్టం చేసినట్టు వివరించారు. అరుణాచల్ ప్రదేశ్ లో నెలకొన్న ఘటనలు, హైదరాబాద్ లో రోహిత్ వేముల ఆత్మహత్య తదితరాలు కూడా అఖిలపక్ష సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. వీటన్నింటినిపై క్లారిటీ ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం పై విపక్షాలు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ సమావేశానికి విపక్ష పార్టీల నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, పీసీ గుప్తా తదితరులు హాజరయ్యారు.