గడ్కరీ కృషిని ప్రశంసించిన మోదీ

October 21, 2015 | 03:29 PM | 2 Views
ప్రింట్ కామెంట్
modi-praises-gadgari-niharonline

"రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అద్భుత పనితీరును కనబరుస్తున్నారు"... ఇవి ప్రధాని నరేంద్ర మోదీ నోటి నుంచి వచ్చిన మాటలు. ఎవరూ ఊహించని విధంగా మోదీ స్వయంగా గడ్కరీని ప్రశంసించడం ఇతర మంత్రుల్లో కాస్తంత అలజడిని రేపింది. వారివారి పనితీరును స్వయంగా సమీక్షించుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది. తన క్యాబినెట్ లోని మంత్రుల పనితీరు అసంతృప్తిని కలిగిస్తోందని గడచిన 16 నెలల్లో పలుమార్లు మోదీ బహిరంగంగా కాకపోయినా, క్యాబినెట్ సమావేశాల్లో వ్యాఖ్యానించారన్న వార్తలు పలుమార్లు వచ్చాయి. 
ఇప్పుడు దశాబ్దాల నుంచి పూర్తి కాని ఎన్నో ముఖ్య ప్రాజెక్టులను 15 నెలల వ్యవధిలో గడ్కరీ పూర్తి చేశారని చెప్పడం గమనార్హం. మోదీ ప్రశంసలు పొందడం వెనుక గడ్కరీ కృషి కూడా ఎంతో ఉంది. రోజుకు కనీసం 15 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం జరగాలని రవాణా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలినాడే ఆదేశించిన గడ్కరీ, తన ఆదేశాలు ఎలా అమలవుతున్నాయన్న విషయమై రోజుకు ఒకసారన్నా ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. వచ్చిన ప్రతి ప్రతిపాదననూ స్వయంగా పరిశీలించి అందుకు అనుమతుల నుంచి నిధుల కేటాయింపు వరకూ పనులు వేగంగా అయ్యేందుకు శ్రమించారు. ఇప్పుడిక గడ్కరీ మాదిరిగానే తాము కూడా మోదీ ప్రశంసలు పొందాలని ఇతర మంత్రులు శ్రమించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ