ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓడిపోయినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుని ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తమ పాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అస్సాం పర్యటనలో భాగంగా ఓ ర్యాలీ లో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.
మిగతా విపక్ష పార్టీలు పార్లమెంట్ సజావుగా సాగాలని కోరుతున్నాయని, అయితే ఒక పార్టీ మాత్రమే వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతోందని మోదీ దుయ్యబట్టారు. తమను ఓడించిన ప్రజలు, పేదలపై కాంగ్రెస్ పార్టీ ప్రతీకారం తీర్చుకుంటోందన్నారు. ఆ కుటుంబం ఒక్కటే బీజేపీ పాలనపై వ్యతిరేకతను చూపుతుందంటూ పరోక్షంగా ఆరోపణలకు దిగారు. అందుకే చట్టసభల్లో కీలక బిల్లులు ఆమోదం పొందకుండా ఆ కుటుంబం అడ్డుకుంటోందని మోదీ ఆరోపించారు. ముఖ్యంగా రాజ్యసభలో వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని తెలిపారు. ఫ్రిబవరి 23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రధాని మరోసారి కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు.