అక్రమంగా అణు పదార్ధాలు రవాణా చేసే దేశాలతో అణు భద్రతకు పెను ముప్పు పొంచి ఉందని మోదీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ లో జరిగిన అణు భద్రతా సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా, అది పరోక్షంగా పొరుగున ఉన్న పాకిస్థాన్ గురించేనా అన్నది అనిపిస్తోంది. అణు కార్యక్రమాలపై పనిచేసే ప్రభుత్వ పెద్దలకు.. అణు పదార్ధాలను అక్రమ రవాణా చేసేవాళ్లతో ఉన్న సంబంధాల వల్ల అణు భద్రత అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. మోదీ చేసిన ఈ సూచనలు గతంలో పాకిస్థాన్ అనుసరించిన వైఖరిని స్పష్టం చేస్తున్నాయి.
ఇటీవల ఉత్తర కొరియా అణు కార్యక్రమాలను వేగవంతం చేసింది. అత్యంత దూకుడుగా అణ్వాయుధాలను తన అమ్ములపొదిలోకి చేర్చుకుంటోంది. అయితే గతంలో ఉత్తర కొరియాకు అణ్వాయుధ రహస్యాలను చేరవేసింది పాకిస్థాన్ అణ్వాయుధ పితామహుడు ఏకే ఖాన్. 1990వ దశకంలో ఏకే ఖాన్ అనేకసార్లు ఉత్తర కొరియా వెళ్లారు. ప్రతి నెల ప్యోంగ్యాంగ్‌కు వెళ్లేవారు. వెళ్లిన ప్రతిసారీ ఆయన అణ్వాయుధ టెక్నాలజీని తీసుకెళ్లేవారు. యురేనియం శుద్ధీకరణకు అవసరమైన సెంట్రిఫ్యూజ్‌లను ఏకే ఖాన్ తీసుకెళ్లారన్న ఆరోపణలు ఉన్నాయి.
న్యూక్లియర్ టెక్నాలజీని ఉత్తర కొరియాకు చేరవేసిన ఏకే ఖాన్‌కు 2004లో అప్పటి పాక్ దేశాధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ క్షమాభిక్ష ప్రసాదించారు. అంతర్జాతీయ అణు వ్యాపారంలో తన పాత్ర ఉన్నట్లు ఖాన్ వెల్లడించిన తర్వాత ముషార్రఫ్ ఆ దేశ అణు శాస్త్రవేత్తను వదిలేశారు. అణు పదార్ధాలను బ్లాక్ మార్కెట్లో అమ్మిన ఏకే ఖాన్‌కు తమ ప్రభుత్వంతో ఎటువంటి అధికారిక సంబంధం లేదని పాకిస్థాన్ అప్పట్లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మోదీ అలాంటి హెచ్చరికలు చేయాల్సి వచ్చింది.
అణ్వాయుధ సమీకరణలో పాకిస్థాన్‌కు చైనా కూడా మద్దతు ఇస్తుంది. అంతేకాదు, ఇదే అంశంలో కమ్యూనిస్టు చైనా ఉత్తర కొరియాకు కూడా అండగా ఉంటోంది. ఆల్ ఖైదా, జైషే లాంటి సంస్థలకు పాకిస్థాన్ బాహాటంగా మద్దత్తు ఇస్తున్నందు వల్ల ఆ దేశం వల్ల ప్రమాదం ఉందన్న రీతిలో అణు భద్రతా సదస్సులో మోదీ హెచ్చరికలు చేయాల్సి వచ్చిందన్న మాట.