భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన చివరి దశకు చేరుకుంది. ఆయన బుధవారం కెనడా చేరుకున్నారు. కెనడా విదేశాంగశాఖ అధికారులు మోదీ బృందాన్ని సాదరంగా ఆహ్వానించారు. గత 42 ఏళ్లలో ఓ భారత ప్రధాని కెనడా వెళ్లడం ఇదే మొదటిసారి. ఇరు దేశాలు పరస్పరం సహకారం అందించుకునే దిశగా ఆ దేశాధినేతలతో ధ్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఈ సందర్భంగా తాను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కెనడా వారిని మోదీ కోరనున్నారు. కాగా, మోదీ రాక తమకెంతో సంతోషాన్నిచ్చిందని, ఇరు దేశాల ధ్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడానికి మోదీ పర్యటన ఎంతో ఉపకరిస్తుందని కెనడా విదేశాంగశాఖ ప్రతినిధి వ్యాఖ్యానించారు. యురేనియం దిగుమతి సహా మరికొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. ఇక భారతీయ సంతతి జనాభా ఎక్కువగా ఉండే కెనడాలో మోదీ రాక సందర్భంగా సందడి నెలకొంది. ఆయన బస చేసే హోటల్ దగ్గరకు భారతీయులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. భారత జెండాలు, ఫ్లకార్డులు ప్రదర్శించారు. ప్రధాని కాన్వాయ్ అక్కడకు చేరుకోగానే వారు ‘‘మోదీ’’... ‘‘మోదీ’’... అంటూ నినాదాలు చేశారు. మోదీ వారికి దూరం నుంచే అభివాదం చేసి హోటల్‌లోకి వెళ్లిపోయారు. ఇక శుక్రవారంతో ఆయన కెనడా పర్యటన ముగిసిన తర్వాత మోదీ తిరిగి స్వదేశానికి వస్తారు.