సముద్ర తీరప్రాంత భద్రత అత్యంత కీలకంగా మారిందని దేశ ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. సముద్రతలం ద్వారా ఉగ్రవాద చొరబాట్లను ఎదుర్కోవడం, సముద్రంపై దోపిడీలను అరికట్టడం వంటి రెండు సమస్యలు ఇప్పుడు తీరప్రాంత భద్రతకు ప్రధాన సవాళ్లుగా నిలిచాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్ తొలిసారిగా గ్లోబల్ మారిటైమ్ సమ్మిట్ (అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం శిఖరాగ్ర సదస్సు)కు ఆతిథ్యమివ్వనుందని వెల్లడించారు. విశాఖపట్టణంలో జరుగుతున్న అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష ( ఫ్లీట్ రివ్యూ-2016)లో ప్రధాని ప్రసంగించారు. ముంబైలో దాడులకు తెగబడిన ఉగ్రవాదులు సముద్రమార్గాన్ని ఉపయోగించుకున్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ.. సముద్రతల ఉగ్రవాదంతో ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, సుస్థిరతకు తీవ్ర విఘాతం కలుగుతున్నదని పేర్కొన్నారు. వాణిజ్య సరుకులు తీసుకెళ్లే నౌకలు లక్ష్యంగా సాగుతున్న దోపిడీలు కూడా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయని అన్నారు.
సముద్ర నౌకాయానానికి సంబంధించి ఆయా దేశాల సముద్ర జలాల పరిధిలో స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకోవడానికి అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాలని, అంతేగాని పోటీ పడకూడదని సూచించారు. చైనా సముద్రంపై ఆయా దేశాల మధ్య వివాదాలు రాజుకుంటున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఫ్లీట్ రివ్యూలో పాల్గొనడం తనకు గర్వంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తికి నౌకాదళ సమీక్షలో పాల్గొన్న 37 భారత తయారీ నౌకలు నిదర్శనమని, వీటి సంఖ్య భవిష్యత్తులో మరింత పెరుగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సముద్రతలంపై ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలపైనే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు.