రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుకగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ సర్కారు సన్నద్ధమైంది. ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 28 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ధి పొందుతారని ఆర్థిక శాఖ ప్రాథమిక అంచనా. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు అవసరమయ్యే విధివిధానాలను అధ్యయనం చేసేందుకు గత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నేతృత్వంలో ఏడు విభాగాల ముఖ్య కార్యదర్శుల కమిటీ సుదీర్ఘంగా కసరత్తు చేసింది. గత నెలలోనే ఈ కమిటీ తమ నివేదికను సిద్ధం చేసి, మార్గదర్శకాలను రూపొందించింది. ఈ కమిటీ నివేదికతో పాటు ఆర్థిక శాఖ సిద్ధం చేసిన ఫైలు ప్రస్తుతం సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉంది. రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం నాటికి అంటే గత ఏడాది జూన్ 2 నాటికి అయిదేళ్ల సర్వీసు నిండిన కాంట్రాక్టు ఉద్యోగులను ముందుగా రెగ్యులరైజ్ చేస్తారు. రెండో విడతలో అయిదేళ్లు నిండని అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు. అయిదేళ్ల పాటు కాంట్రాక్టు ఉద్యోగులుగానే గుర్తించి.. తర్వాతే రెగ్యులర్ అయ్యే అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ ఈ క్రమబద్ధీకరణ పథకం వర్తిస్తుంది. ప్రత్యేక ప్రాజెక్టులు, స్కీముల కింద పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వర్తించదు. కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.