ఏపీలో 'జంపింగ్' రాజకీయం ఊపందుకుంటుంది. గత నాలుగురోజుల నుంచి కర్నూల్ కీలకనేత భూమానాగిరెడ్డితోపాటు ఆయన కుమార్తె అఖిల ప్రియ పార్టీ మారతారనే ఊహాగానాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఊహించని రీతిలో ఈ ఫిరాయింపులు ఉండబోతున్నట్లు సమాచారం. వీరితోపాటు మరో ఆరుగురు వైకాపాను వీడి ఏ క్షణమైనా వెళ్లవచ్చన్న సంకేతాలు అందుతున్నాయి. అయితే అధికారికంగా స్పష్టమైన సమాచారం లేనప్పటికీ, నేటి సాయంత్రం కనీసం నలుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబుతో సమావేశం కానున్నారని తెలుస్తోంది.
పార్టీ మారే విషయంలో మాత్రం భూమా కాస్త సస్పెన్స్ మెయింటెన్ చేస్తూ వస్తున్నారు. ఈ ఉదయం పీఏసీ సమావేశం అనంతరం ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి అందించారని కమిటీ సభ్యులు మీడియాకు ఉప్పందించగా, ఆపై బయటకు వచ్చిన అనంతరం భూమా మాత్రం, ఏ విషయాన్నీ స్పష్టంగా వెల్లడించకుండా వెళ్లిపోయారు.
"సమయం వచ్చినప్పుడు చెబుతాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటి వరకూ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. సరైన సమయం కోసం వేచిచూస్తున్నా. ఏం చేసినా మీకు చెప్పే చేస్తాను. ప్లీజ్..." అంటూ వెళ్లిపోయారు. దీంతో ఆయన రాజీనామా చేశారా? లేదా? అన్న విషయంలో స్పష్టత కొరవడింది. మరోవైపు కర్నూలు జిల్లాలో తెలుగుదేశం ప్రధాన నేతలుగా ఉన్న శిల్పా సోదరులతో చంద్రబాబు మరికాసేపట్లో ప్రత్యేకంగా భేటీ కానున్న నేపథ్యంలో సస్పెన్స్ మరింతగా పెరిగింది.
కర్నూలు జిల్లాలో బలమైన వైకాపా వర్గానికి నాయకత్వం వహిస్తూ వచ్చిన భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియలతో పాటు ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, ఆదినారాయణ రెడ్డిలు చంద్రబాబుతో భేటీ అవుతారని సమాచారం. సాయంత్రం కల్లా ఈ జంపింగ్ లపై ఓ క్లారిటీ వస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరో నలుగురు ఎవరనే దానిపై ఇంకా ఓ స్పష్టతరాలేదు.