ఓవైపు కాంగ్రెస్ ఆరోపణలతో తలపట్టుకుంటున్న బీజేపీకి ఇప్పుడు ఆప్ తలనొప్పి మొదలైంది. నీతివంతమైన పాలన చేయాలంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ నలుగురు ఓ పనిచేయాలని ఆమ్ ఆద్మీ డిమాండ్ చేస్తోంది. బీజేపీ మహిళా కేంద్ర మంత్రులతోపాటు (సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ) రాజస్థాన్ సీఎం వసుంధరారాజే, మహారాష్ట్ర మహిళా మంత్రి పంకజ్ ముండే లు తక్షణం రాజీనామా చేయాలని ఆప్ అంటోంది. అంతేకాదు గురువారం ఆప్ ఆధ్వర్యంలో కార్యకర్తలు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ నివాసాన్ని ముట్టడించారు కూడా. ఈ సందర్భంగా ఆప్ కార్యకర్తలు, భద్రతాధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అవినీతిని అంతంచేస్తామంటూ అధికారంలోకి వచ్చి బీజేపీ అలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ కేంద్ర మంత్రులను తొలగించటం లేదని ఆప్ విమర్శిస్తోంది. లలిత్ మోదీ పాస్ పోర్ట్ వ్యవహారంలో సుష్మాస్మరాజ్, వసుంధరా రాజేల పై ఆరోపణలు రాగా, మహారాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజ్ ముండేపై 200 కోట్ల కొనుగోళ్ల కుంభకోణం ఆరోపణలు వచ్చాయి, ఇక మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పై నకిలీ విద్యార్హతల ఆరోపణల వెలువెత్తిన సంగతి తెలిసిందే. ఇక ఆయా వ్యవహారాల్లో ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే.