ఇప్పటికే ఇద్దరు కీలక మహిళా నేతలపై ఆరోపణలతో సతమతమవుతున్న బీజేపీ కి మరో దెబ్బ పడింది. మహారాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజ ముండే 200 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. పాఠశాలలకు సంబంధించి కొనుగోళ్లలో ఆమె కనీస ప్రమాణాలను పక్కనబెట్టి 200 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారన్నది వారి ఆరోపణ. నిబంధనల ప్రకారం రూ.3లక్షలకు మించి కొనుగోలు చేసే ఏ అంశానికైనా ఈ టెండర్ల ద్వారా నిర్వహించాలి. అందుకు భిన్నంగా టెండర్ ప్రక్రియ లేకుండానే ఏకంగా 114 కోట్ల వేరుశనగా, బెల్లం పాకంతో తయారు చేసిన చిక్కీని కొనుగోలుకు సంబంధించిన అనుమతుల అంశం బయటకు తేవటంతో ఇప్పుడు ప్రకపంనలు మొదలయ్యాయి. కాగా, ఈ ఆరోపణలపై పంకజ్ ముండే స్పందిస్తూ కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవమని, నిబంధనలకు అనుగుణంగానే కేటాయింపులు జరిగాయని చెబుతున్నారు. అప్పట్లో ఆన్ లైన్ టెండర్ విధానం అమలులో లేదన్న విషయాన్ని ఆమె గుర్తుచేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై మహా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ... ఆరోపణలకు సంబంధించి ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవంటున్నారు. అన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పంకజ్ ముండే దివంగత నేత గోపీనాథ్ ముండే కూతురు.