అంచెలంచెలుగా ఎదిగి తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన నేతగా మారారు సినీ నటి కుష్బూ. కాంగ్రెస్ కీలక నేతగా ఎదిగిన ఆమె ఇప్పుడు అక్కడి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ఆమె కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి అదీ ఆమె రేంజ్. సీనియర్ల ఊహకు కూడా అందకుండా ఏకంగా అధినేత సోనియాతోనే నేరుగా వెళ్లి కలిసే సీన్ ఆమెకు ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అసలు రావటం రావటమే ఆమెకు అధికార ప్రతినిధి పదవి కట్టబెట్టడంతో సీనియర్లు సైతం విస్తూ పోయారు. మరి అలాంటి నేత జోలికి వస్తే ఊరుకుంటుందా? తనను విమర్శిస్తున్న వారిపై ఉగ్రకాళిలా నిప్పులు చెరిగారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇలంగోన్ పదవి పోకుండా కాపాడటం, గతంలో ఆమె డీఎంకే లో ఉన్న విషయాలను ప్రస్తావిస్తూ కొందరు మహిళా సీనియర్ నేతలు ఆమెపై విమర్శలు గుప్పించారు.
దీనిపై ఈరోడ్ లో జరిగిన కాంగ్రెస్ మహానాడులో ప్రస్తావించిన కుష్బూ, తీవ్రంగా స్పందించారు. నేను పులి లాంటిదాన్నని, రెచ్చగొడితే, పంజా విసురుతా అని ఆమె హెచ్చరించారు. ఓ మాములు నటి అయిన ఆమెకు అసలు ఆమెకు అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది. ఢిల్లీ స్థాయిలో మంచి పరపతి ఉన్న కుష్బూ, దాన్ని ఉపయోగించే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇలంగోవన్ పదవి ఊడిపోకుండా ఆపిందని తెలుస్తోంది. ఇలంగోన్ పై ఉన్న వ్యతిరేకతతో పలువురు సీనియర్ మహిళా నేతలు ఆమెపై విమర్శలు గుప్పించారు. దానికి ఆమె చెప్పే సమాధానం పార్టీని బలపరిచేందుకు శ్రమిస్తున్నందునే ఇలంగోవన్ కు తాను మద్దతుగా నిలిచానని. డీఎంకే నుంచి తాను ఎందుకు బయటకు వచ్చానో అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట కాంగ్రెస్ సత్తా చాటుతుందని తెలిపారు.
కనుసైగతో పార్టీని చెప్పుచేతలో పెట్టుకోవటం అన్నాడీఎంకే జయలలితను మించిన వారు ఎవరూ లేరనుకుంటున్న సమయంలో కుష్బూ వ్యవహారశైలి కాస్త ఆసక్తిని రేపుతుంది. చూస్తుంటే ఆమె నెక్స్ట్ అమ్మ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో. అయితే జయలా ప్రజల మన్ననలు అందుకోవటం, విపరీత అభిమానులను ఏర్పరుచుకోవటం మాత్రం కుష్బూ తో అయ్యే పనేనా అన్నది పెద్ద ప్రశ్నే?